పల్లవి:
యేసుక్రీస్తు ప్రభువా మేము నీ మోక్షముఁ బొందుటకు దోసపు లోకము లోనికి వచ్చితి దోషులఁ బ్రోచుటకు ||యేసు||
1. పరిశుద్ధుఁడ వీవు ఇలలో పాపుల నందరిని పరిపరివిధ కృప వాక్కులతోడను పిలిచితి వెల్లప్పుడు ||యేసు||
2. సత్యపు నడతలతో జగతిని సర్వాద్భుతములను నిత్యముఁ జేయుచు నీ కృప చాల యిలలోఁ దెల్పితివే ||యేసు||
3. అతి పుణ్యాత్ముఁడవే క్షితిలో వెతలను బొందితివే మృతిని బొందియు మూఁడవ దినమున బ్రతికియు లేచితివే ||యేసు||
4. పాపుల మని తెలిసి నీదగు దాపున జేరఁగనే పాపముఁ బాపుచు ప్రాపుగ నుండెడి ప్రభుఁడవు నీవెగదా ||యేసు||
5. దురిత వితతి దూరా నమ్మిన దురితుల స్నేహితుఁడా నిరతము మమ్మును నీ కృప లోపల నిలకడగాఁ బెంచు ||యేసు||
6. నోరు నిండ నెదలో నీ కృప ప్రేరేపణఁగలిగి సారెకు వేఁడెద ముర్వికి రక్షణ కారకుఁడా నిన్ను ||యేసు||
