91. క్రీస్తునకు స్తుతి

రాగం: శహన • తాళం: ఆది • రచయిత: తిరుకోవళ్లూరి స్టీవెన్
పల్లవి:నా రక్షకా యేసునాధ ఇమ్మానుయేలు ఘోర పాపుల పాప భార విమోచక ||నా రక్షకా||
1. నిత్యకాలమునందు నిజమైన దేవుని సత్యవాక్యమై యున్న స్వామి నిన్నుతియింతు ||నా రక్షకా||
2. సర్వ లోకంబులను సత్యవాక్యమై యుండి నిర్వహించిన దేవుని నిజబాహువా స్తుతింతు ||నా రక్షకా||
3. దేవజనులకు సువార్త దెలుప నభిషేకంబు పూని నొందిన దేవపుత్రుడ నుతియింతు ||నా రక్షకా||
4. దేవ మహిమ ప్రకాశ దీనరక్షక మాను ష్యావతారము దాల్చి యావదాజ్ఞల దీర్చిన ||నా రక్షకా||
5. పావనాద్భుతుడవై పరమ జ్ఞానము దెల్పిన దేవస్వభావ ముద్ర దేదీప్యుడా స్తుతింతు ||నా రక్షకా||
6. పాపాత్ములను గావ శాపభారము క్రింద నోపికతో నిల్చి ప్రాపు జూపిన ప్రభువా ||నా రక్షకా||
7. ఈ వసుధను ప్రేమ నెసగునట్లుగ జూపి చావు గెల్చిన సర్వ సామర్థ్యుడా స్తుతింతు ||నా రక్షకా||
8. ఘన దేవుని కుడి పార్శ్వమున గూర్చుండి విజ్ఞప్తి నొనరించు నా యేసు వినయ స్తోత్రంబిదిగో ||నా రక్షకా||