కీర్తనలు

581. కోఁత యజమానుఁడు

రాగం: బిలహరి|తాళం: త్రిపుట|రచయిత: కడియం గాబ్రియేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
కోఁత యజమానుండ స్తోత్రముఁ గూర్మితో నొనరింతుము ప్రీతి మీర గ మాదు పొలములు పెరిగి పండెను గావునఁ ||కోఁత||
1.  నీదు సేవకులైన వారలు నిండు మోదముఁ నొందుచు నీ దయ నొక యేటి గ్రాసము నీ దినంబున గాంతురు ||కోఁత||
2.  విత్తుకాలము కోఁతకాలము విమలమైన తలంపులు చిత్తమునఁ బుట్టించి మాకతి క్షేమ మొసఁగితి రక్షకా ||కోఁత||
3.  వేసవిని భువి మేము నాటిన విత్తనం బతిరమ్యమై భాసురంబగు పచ్చ మొక్కయి బయలువడె నిది చిత్రము ||కోఁత||
4.  జల సమాధిని వెడలి చక్కఁగ బలముతో నీ గింజలు బలుఁడు దేవుని శక్తి చేతను బాగుగను ఫలియించెను ||గోఁత||
5.  ఆ ప్రకారమె నీదు నామము నందు కాలము చేసి యా ప్రజలు దేహములు మహిమను నందఁ జేయుము రక్షకా ||కోఁత||
6.  కోఁత కార్యమువల్ల గూడను కూర్మిచే నీ బిడ్డలు నీతులను నేర్వంగఁ జేయుము ప్రీతిగల మా రక్షకా ||కోఁత||
7.  దూత లంత్య దినంబునందున కోఁత గోయుదు రంతట నా తరుణ మున గురుగు లన్నియు నగ్నిలోఁ బడవైతురు ||కోఁత||
8.  లోకమందలి గాలి వానల లోను మే మిఁక నుండక నాకమందున దండ్రి మింటను నేకముగ జీవింతుము ||కోఁత||
9.  నీవు నేర్పిన యట్లే మే మిల నిన్నుఁ బ్రతిదినమందును జీవనోపాయంపు భుక్తిని దేవ, వేఁడఁగఁ జేయుమీ ||కోఁత||
10.  మేఇన నేఁ బోషించు నన్న పానములనే వేఁడక జానుగా నాత్మలకునౌ భో జనము వేఁడఁ నీయుమీ ||కోఁత||
11.  వసుధ నినుఁ బ్రార్థించు జన జీ వంపు రొట్టెవు నీవెగా అనువు నాదరణంబు భుక్తిని యగుము మా కిల నెప్పుడున్ ||గోఁత||