496. పునరుత్థాన దినము

రాగం: పంతువరాళి • తాళం: చాపు • రచయిత: మేడికాయల సాధువు
పల్లవి:లేచు దినము వచ్చును మృతు లెల్ల నికఁ లేచు దినము వచ్చును వేచి యిల నున్నట్టి విమలు లెల్ల నడుపు లేచి ప్రభుని నెదురు కొందు రానందముతో ||లేచు||
1. యేసు మేఘారూఢూండై యిలకు దిగ వాసిగ దూత లపుడు భాసురంబుగ బాకా పై నినాదము సేయ గ సమాధుల నిద్రగాంచు జనులెల్లరు ||లేచు||
2. కడబూర ధ్వని సేయఁగ మడిసిన వారు తడవు సేయక లేతురు ఎడతెగక ప్రభు నొద్దఁ గడు సంతసంబుతో విడువక యుందు రా విమల లోకమునందు ||లేచు||
3. ఘన మహిమన్ బ్రభువు రాఁగన్ గడలి యపుడు తన యందుండెడి శవములన్ ఘనముగఁ గాననము దనయందుండెడు మృతులన్ వినయంబుతో దెచ్చి విభుని కప్పగింప ||లేచు||
4. అరయంగ నీతపరు లా నందమున న క్షర దేహులై వెలయుచున్ జిరత రానందంబు బరలోకమున నెపుడు స్ఫురిత జీవను లగుచుఁ బరమ సుఖ మొందుదురు ||లేచు||
5. కరుణ లేని సమాధీ నిరతము నన్నుఁ జెరపట్టి యుంచగలవే వరదుండు క్రీస్తుండు వర దూత సేనలతోఁ బరివేష్టితుఁడై యదిగో నరుదెంచుచున్నాఁ డు ||లేచు||
6. మరణమా నీ ముల్లేది నరులను నింక వెఱపించు చుండగలవే మరణ సంహారుండు మహిమతో నరుదేరన్ మరణం బడుగుబడి య మర త్వంబిఁక నుండున్ ||లేచు||
7. మరణంబు నొందలేదా ప్రభు యేసు నీ చెఱయందు నుండలేదా పరమేశు తనయుండు మరణ సమాధులన్ పరిపూర్ణముగ గెల్చి చెఱను జెరగపట్టెను ||లేచు||
8. మంగళములు పాడరే క్రీస్తుకు జయ మంగళములు పాడరే మంగళములు పాడి మంగళ ప్రదుఁడైన శృంగార రాజునకు సంగీతంబులతోడ మంగళములు పాడరే ||లేచు||