377. క్రీస్తునందలి అభయము

రాగం: హుసేని • తాళం: అట • రచయిత: పురుషోత్తము చౌదరి
పల్లవి:నన్ను ఁ గన్నయ్య రావె నా యేసు నన్నుఁ గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను||
1. ముందు నీ పాదారవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను పొంది కగాఁ జేయ రావే నా డెంద మానంద మనంతమై యుప్పొంగ ||నన్ను||
2. హద్దులేనట్టి దురాశల నవివేకినై కూడి యాడితి మొద్దులతో నింకఁ కూటమి వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను||
3. కాలము పెక్కు గతించెను గర్వాదు లెడఁదెగ వాయెను ఈ లోక మాయ సుఖేచ్ఛలు చాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను||
4. దారుణ సంసార వారథి దరిఁ జూపి ప్రోవ నీ కన్నను కారణ గురువు లింకెవ్వరు లేరయ్య లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను||
5. నా వంటి దుష్కరమ్మజీవినిఁ కేవల మగు నీదు పేర్మిని దీవించి రక్షింప నిప్పుడే రావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను||