పల్లవి:
యేసు నాథ కథా సుధా రస మిదిగో పానముఁ జేయరే దోసకారి జనంబులారా దురిత భవముల బాయరే ||యేసు||
1. ఇహపరంబు లెవనిచే సృజి యింపఁబడియెనొ చూడరే అసహహ యా విభుఁ డవతరించెను అతని గుణములఁ బాడరే ||యేసు||
2. దురిత భరితుల దుష్ట చరితుల నరయ వచ్చెను జూడరే స్థిరముగామది నమ్మి యా ప్రభు కరుణ మదిఁ గొనియాడరే ||యేసు||
3. పనికిమాలిన వేలుపుల దెస పరుగు లెత్తుట మానరే తనువు మీ కొఱ కిచ్చు క్రీస్తుని దయకుఁ బాత్రతఁ బూనరే ||యేసు||
4. మరణ బలి రక్తమున మన యం దఱిని బ్రోవను వచ్చెను కరుణతోఁ బాపులఁ బిలుచు గురు దరికిఁబోవుద మిచ్ఛను ||యేసు||
5. పరమతత్వ విధాన బోధలు బాగుగఁ బ్రకటించెను చిరసుఖాస్పద పదముఁ గోరిన జీవులకు వినిపించెను ||యేసు||
6. మరణ మొందిన కొందఱికిఁ దా మరలఁ బ్రాణము లిచ్చెను వర మహాద్భుత కార్యముల ని ద్ధర ననేక మొనర్చెను ||యేసు||
7. కుటిల బుద్ధుల ద్రోచి సజ్జన గోష్టి నుండుట గోరరే దిటముగను నెమ్మదిని మీరొం దుటకుఁ క్రీస్తునిఁ జేరరే ||యేసు||
