← కీర్తనలు

281. నూతన నిబంధన విందు

రాగం: భైరవి|తాళం: చాపు|రచయిత: మార్తాండ జ్ఞానప్రకాశము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మానవుఁడవై సకల నరుల మానక నా దోషములఁ బాపుటకు బలి యైతివే యేసూ బహు ప్రేమతోడ ||మానవుఁడవై||
1.  నీదు బలిని నిత్యముగను నిజముగా ధ్యానించి ప్రేమను నీదు దివ్య ప్రేమ నొందుటకు నియమంబు నిచ్చి ||మానవుఁడవై||
2.  నీవె జీవపు రొట్టె వంటివి నీవె జీవ జలంబు వంటివి నిన్ను ననుభ వించుఁడంటివిగా నిజదేవా యేసూ ||మానవుఁడవై||
3.  నీ శరీరము రొట్టెవలెనే నిజముగా విరువంగఁబడెనే నిన్నుఁ దిను భాగ్యంబు నిచ్చితివే నా యన్న యేసూ ||మానవుఁడవై||
4.  మంచి యూట మించి దండి పంచగాయములలో నుండి నిత్యజీవపు టూటలు జేసితి నీ ప్రేమ నుండి ||మానవుఁడవై||
5.  నిన్ను జ్ఞాపక ముంచుకొనుటకు నీదు ప్రేమ బలిలో మనుటకు నిత్య మాచరించుఁడంటివి నీ నిజభక్తితోడ ||మానవుఁడవై||
6.  ఎంతో ప్రేమతో బలిగా నైతివి యెంతో ప్రేమాచారమైతివి చింతలును నా పాపములు బాప శ్రీ యేసు దేవా ||మానవుఁడవై||
7.  నిత్యబలి యగు నిన్నే నమ్మి నిన్ను ననుభవించి నెమ్మి నిన్ను నిముడించుకొని నాలో నీ నిజరూప మొంద ||మానవుఁడవై||
8.  నేను నీ బలిలోనఁ గలిసి నేను నీతోఁ గలిసి మెలిసి నేను నీవలె నుండఁ జేసితివే నా దివ్య యేసూ ||మానవుఁడవై||
9.  నీదు శ్రమలను బలిని నిపుడు నాదు కనులు చూడ నెపుడు నాదు పాపభారములు దిగునే నా దివ్య యేసూ ||మానవుఁడవై||
10.  నీవు బలియై తిరిగి లేచి నిత్య తేజోరూపు దాల్చి నిత్యమును నా బంతి నున్నావే నిజ దేవా యేసూ ||మానవుఁడవై||
11.  నీవే నీ చేతులతో నిత్తువు ఈ నీ బలివిందునకు వత్తువు నిన్ను నిట జూచితిని నా యేసూ! యెన్నఁడును మరవను ||మానవుఁడవై||