పల్లవి:
యేసుని ప్రేమను నేమారకను నెప్పుడు దలఁచవే యో మనసా వాసిగ నాతని వరనామంబును వదలక పొగడవె యో మనసా||
1. పాపులకొరకై ప్రాణముఁ బెట్టిన ప్రభు నిలఁ దలఁచవె యో మనసా శాపము నంతయుఁ జక్కఁగ నోర్చిన శాంతుని పొగడవె యో మనసా ||యేసుని||
2. కష్టములలో మన కండగ నుండిన కర్తను దలఁచవె యో మనసా నష్టములన్నియు నణఁచిన యాగురు శ్రేష్ఠుని ప్పొగడవె యో మనసా ||యేసుని||
3. మరణతఱిని మన శరణుగ నుండెడు మాన్యునిఁ దలఁచవె యో మనసా కరుణను మన క న్నీటి దుడిచిన కర్తను పొగడవె యో మనసా ||యేసుని||
4. ప్రార్థనలు విని ఫలముల నొసఁగిన ప్రభు నిఁక దలఁచవె యో మనసా వర్థనఁ గోరుచు శ్రద్ధతో దిద్దిన వంద్యుని పొగడవె యో మనసా ||యేసుని||
5. వంచనలేక వరముల నొసఁగిన వరదునిఁ దలఁచవె యో మనసా కొంచెము కాని కూర్మితో దేవుని కొమరుని పొగడవె యో మనసా ||యేసుని||
