156. క్రీస్తు తుఫానును నిమ్మళపర్చుట

రాగం: ముఖారి • తాళం: త్రిపుట • రచయిత: తూసిలి బెంజిమిన్
పల్లవి:ఏలాటివాఁడో కాని యీ యేసుని నేమని వివరింతుము గాలివాన యేసుని గద్దింపునకుఁ చాల భయపడి నిలిచెను ||ఏలాటి||
1. ముద్దు శిష్యులతోడను సముద్రపు టద్దరికి వెళ్లెను కొద్ది పడవనెక్కెను ఇంతలోనె పెద్దగాలి రేగెను ||ఏలాటి||
2. అల్లకల్లోలముగా సముద్రము అల్లలాడు నప్పుడు చల్లఁగ దోనె వెనుక తలగడపైని మెల్లన నిదువోయెన్ ||ఏలాటి||
3. చింత లేదా యేమయ్యా బోధకుఁడా న శించిపోవుచున్నాము ఎంతో వేదన పడితిమి కాపాడుమ టంచు శిష్యులు లేపిరి ||ఏలాటి||
4. దిగ్గునఁ బ్రభువు లేచి యా గాలిని గద్దించిన వెంటనే తగ్గి నిమ్మళించెను సమస్తము సద్దు ఉడిగిపోయెను ||ఏలాటి||
5. ఏల భీతు లైతిరి యింతలోనే యెంత నమ్మిక లేదని యీలాగు నోదార్చెను యేసు తన సొంత శిష్యుల నప్పుడు ||ఏలాటి||