← కీర్తనలు

150. లాజరును తిరిగి బ్రతికించుట

రాగం: శంకరాభరణము|తాళం: ఆది|రచయిత: పురుషోత్తముచౌధరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
వినరె మనుజులార క్రీస్తుఁ డిలనుఁ జేయు ఘనములైన పనులలోనఁ జిత్రమొక్క పని వచించెద ||వినరె||
1.  మన మనంబు లలరుచుండ దినదినంబు ప్రభుని నిండు ఘన మహాద్భుతములు వినినఁ దనివిఁ దీరదు ||వినరె||
2.  ఇలను బేతనియపురంబు గలదు మరియ మార్తలక్క సెలియలందు వాసముండి రెలమితోడను ||వినరె||
3.  పరిమళంపు తైలమేసు చరణములకుఁ బూసిన యీ మరియ సోదరుండు రోగ భరితుఁడయ్యెను ||వినరె||
4.  వ్యాధిచేత లాజరుండు బాధనొందుచుండఁ గ్రీస్తు నాధుఁ బిలువనంపి రపుడు నాతు లిరువురు ||వినరె||
5.  తమ్ము డక్క సెలియలును బ్రి యమ్ము తనకుఁ గలిగియుండ నమ్మహాత్ముఁ డైన క్రీస్తుఁ డరిగె నచటికి ||వినరె||
6.  యేసువచ్చు టెఱిగి మార్త యెదురు గానుఁ బోయి తనదు దోసిలొగ్గి మ్రొక్కి ప్రభువు తోడ బల్కెను ||వినరె||
7.  కర్త నీకు దేవుఁడిచ్చు ఘనబలమెఱుగుదును సత్య వర్తి విచట లేని కతన వ్రాలె లాజరు ||వినరె||
8.  పిదప మరియవచ్చి క్రీస్తు పదయుగమున కొరిగి యేడ్చి మొదట మార్త పలికినట్లు సుదతి పలికెను ||వినరె||
9.  అనుపల్లవి: ుడు కర్త వారిపలుకు లాలకించి మదిని మూల్గి కృపకుఁ బాత్రు రాలితోడ నపుడు నడిచెను ||వినరె||
10.  నడిచి లాజరుని సమాధి కడకుఁ జేరి గుహను మూయఁ బడిన రాయి తీయుఁడనుచుఁ ప్రభువు చెప్పెను ||వినరె||
11.  యేసుతోడ మార్తపలికె నీ సమాధినునిచి నాల్గు వాసరంబులయ్యెఁ గంపు పట్టి యుండదా ||వినరె||
12.  దాని నమ్మి చూడుమని మ హానుభావుఁ డాత్మబలము నూని తండ్రికిపుడు స్తోత్ర మొనరఁజేసెను ||వినరె||
13.  లాజరు సమాధినెడలి రమ్ము లెమ్మటంచు లోక పూజితుఁడు మహా రవంబుఁ బూని పల్కెను ||వినరె||
14.  మరణమైనవాఁడు ప్రాణ భరితుఁడగుచు లేచి వచ్చెఁ తరుణులధిక హర్షలైరి పెదజనంబుతో ||వినరె||
15.  కన వినంగ రాని యిట్టి ఘన మహాద్భుతంబుఁ జూచి జనులు క్రీస్తు యేసునాధు ననుసరించిరి ||వినరె||
16.  కనుక మనము వానిఁ జేరు కొని సుఖంబుఁ బడయవచ్చు మనసు నిలిపి యతనియందు మనుట మేలగున్ ||వినరె||