పల్లవి:మద్యపాన ప్రియులు గాకుండి ప్రియులార మీరా మత్తులోనే మునిఁగి పోకుండి మద్యపానము చేయువారికిఁ దథ్యముగఁ బ్రాప్తించుఁ గీడులు కొద్దియైనన్ రుచిని జూడఁగఁ గోరఁ దగ దని తలఁచుకొనుఁడి ||మద్య||
1. రక్త మంతయుఁ జెడును సుమ్మండి ప్రియులారా మీరు శక్తిహీనులగుదు రిల నుండి శక్యిహీనులె గాక మఱి మీ భక్తి దొలఁగి పోవునండి ముక్తిమార్గము దెలియదండి ముందు గతికి హీనమండి ||మద్య||
2. బుద్ధిబలములు కొద్ది వౌనండి ప్రియులారా మీరు మొద్దు లగుదురనియు నమ్ముండి హద్దు మిరుచుఁ ద్రాగువారికిఁ గొద్దికాలమె జీవమండి శ్రద్ధగల్గి మద్యపానము రద్దు చేయుట తగినదండి ||మద్య||
3. మచ్చునకును త్రాగఁబోకుండి ప్రియులార మీరీ తుచ్ఛమైన పనులు వీడుండీ హెచ్చుగాఁ దిని త్రాగువారికి వచ్చు రోగము కుదురదండి చచ్చుటకు నిది హేతువని మదిఁ గచ్చితముగను దెలిసికొనుఁడి ||మద్య||
4. ఆలుబిడ్డల మేలుఁగోరుండి ప్రియులారా వారి మేలుఁ గోరినఁ ద్రాగంఁ బోకుండి మేలు లెఱింగి పిలుచు క్రీస్తుని జాలిచూపులు దెలిసికొనుఁడి కాలయాపనఁ జేయకుండి కర్త యేసని నమ్ముకొనఁడి ||మద్య||
5. ఘన ధనములు నిలువఁబోవండి ప్రియులార నీచ తనము మీకు మూల మౌనండి తనవిఁదీర్చుదు మద్యమండి ఘనుల కొంపలు గూల్చు నండి ఘనముగాఁ బ్రభువాక్యసారము వినయమతితో ఁ గ్రోలరండి ||మద్య||
