← కీర్తనలు

186. సిలువపై క్రీస్తుని ప్రేమ

రాగం: నాధనామ క్రియ|తాళం: కురుజంపె|రచయిత: యర్మణశెట్టి దావీదు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఏ పాప మెఱుఁగని యోపావన మూర్తి పాప విమోచకుండ నా పాలి దైవమా నా పాపముల కొఱ కీ పాట్లు నొందినావా ||యే పాప||
1.  ముళ్లతోఁ గిరీట మల్లి నీ శిరముపై జల్లాటమున మొత్తిరా ముళ్లపోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షకా ||యే పాప||
2.  కలువరి గిరి దనుక సిలువ మోయలేక కలవరము నొందినావా సిలువ నీతో మోయఁ తులువలు వేఱొకనిఁ దోడుగా నిచ్చినారా ||యే పాప||
3.  చెడుగు యూదులు బెట్టు పడరాని పాట్లకు సుడివడి నడచినావా కడకుఁ కల్వరి గిరి కడ కేగి సిల్వను గ్రక్కున దించినావా ||యే పాప||
4.  ఆ కాల కర్ములు భీకరంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచిరా నీ కాలు సేతులు ఆ కొయ్యకే నూది మేకులతో గ్రుచ్చినారా ||యే పాప||
5.  పలువిధంబుల శ్రమలు చెలరేగఁ దండ్రికి నెలుగెత్తి మొఱలిడితివా సిలువపైఁ బలుమాఱు కలుగుచుండెడి బాధ వలన దాహము నాయెనా ||యే పాప||
6.  బల్లిదుండగు బంటు బల్లెమున నీ ప్రక్కఁ జిల్లిఁ బడఁ బొడిచి నాఁడా ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగఁ జల్లారెఁగద కోపము ||యే పాప||
7.  కటకటా పాప సం కటముఁ బాపుట కింత పటుబాధ నొంది నావా ఎటువంటి దీ ప్రేమ యెటువంటి దీ శాంతి మెటుల వర్ణింతు స్వామి ||యే పాప||